Brahmanandam | తెలుగు సినీ ప్రేక్షకుల్ని తన కామెడీతో ఎంతగానో నవ్వించే బ్రహ్మానందం ఇప్పుడు తన జీవితాన్ని పుస్తక రూపంలో మలిచారు. మీ అండ్ మై పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.1200కి పైగా సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన బ్రహ్మానందం, గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా తన ప్రయాణాన్ని, జీవితం లో ఎదురైన ఎత్తుపల్లాలను ఆయన ఈ పుస్తకంలో వివరించారు.
ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి పెరిగి దేశానికి గర్వకారణంగా మారారు. అలాగే నేను కూడా ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మొదట లెక్చరర్‌గా పనిచేసి, తరువాత సినీ రంగంలో అడుగుపెట్టాను. నా ప్రయాణం, నాకు లభించిన ప్రేమ ఇవన్నీ మీ అందరితో పంచుకోవాలనిపించింది అని బ్రహ్మానందం పేర్కొన్నారు. అంతేకాదు, “నాకు రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఎప్పుడూ లేదు. నా జీవితాన్ని నటనకే అంకితం చేశాను. పదవికి విరమణ ఉంటుంది కానీ, పెదవికి ఉండదు. మనం ఎంతో పవిత్రంగా చూసే కమలం బురద నుంచే పుడుతుంది. అలాగే కష్టపడి పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ విషయంతో వెంకయ్యనాయుడు నాకు ఎంతో ప్రేరణగా ఉంటారు.
సినిమాల్లో నటన కొంచెం తగ్గించినా, మీమర్స్ మాత్రం నన్ను వదలట్లేదు. నన్ను ఇప్పుడు ‘మీమ్స్ బాయ్’గా మార్చేశారు. అయినా, పది మందిని నవ్వించడమే నా జీవిత లక్ష్యం,” అన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, “బ్రహ్మానందం అలుపెరుగని కళాకారుడు. ఆయన తెరపై కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. అలాంటి కళాకారుడి జీవితకథను ఆవిష్కరించటం నా అదృష్టంగా భావిస్తున్నాను,” అని చెప్పారు. అలాగే భాషల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ “ప్రతి ఒక్కరూ తమ మాతృభాషని ప్రేమించాలి. కానీ ప్రపంచంలో పోటీ చేయాలంటే హిందీ, ఇంగ్లీష్ వంటి ఇతర భాషల్ని కూడా నేర్చుకోవాలి,” అని సూచించారు. మీ అండ్ మై పుస్తకం తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో మూడు భారతీయ భాషల్లో విడుదల కానుంది.