అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన నాలుగవ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ వీరిద్దరూ చేతులు కలుపనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తారట. ఇప్పటికే గీతా ఆర్ట్స్ నుంచి బోయపాటి అడ్వాన్స్ తీసుకొని ఉన్నట్టు సమాచారం. ‘సరైనోడు’ తర్వాత బన్నీతో మరో సినిమా చేయాలని అరవింద్ ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారట.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ అడ్వాన్స్‌ను బాలయ్య సినిమా కోసం ఉపయోగించుకుంటున్నారట అల్లు అరవింద్. 2027లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ వర్గాల వినికిడి. ఇదిలావుంటే.. గీతా ఆర్ట్స్‌లో బోయపాటి చేసే ఈ సినిమా సింగిల్ హీరో మూవీ కాదని, అదో మల్టీస్టారర్ అని, బాలకృష్ణ, బన్నీ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తారనే టాక్ కూడా బయట వినిపిస్తున్నది. నిజం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.