Shyam Benegal | దిగ్గజ దర్శకుడు, నిర్మాత శ్యామ్ బెనగళ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు వైఫల్యం చెందినట్లుగా సమాచారం. ఈ విషయం రెండు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు.
88 ఏళ్ల శ్యామ్ బెనగళ్ ఆరోగ్యం ఇటీవల క్షీణించిందని, దాంతో ఆయన కార్యాలయానికి సైతం వెళ్లడం లేదని సిబ్బంది తెలిపారు. ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు శ్యామ్ బెనగళ్. ఆయన ఇప్పటి వరకు 18 జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డుతో సహా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సినీరంగానికి చేసిన సేవకు గాను భారతదేశ అత్యున్నత పురస్కారమైన దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును 2005లో అందుకున్నారు. అంతకు ముందు ఆయనను భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్‌తో సత్కరించింది.
ఆయన ‘జుబేదా’, ‘మమ్మో’, ‘వెల్కమ్ టూ సజ్జన్‌పూర్ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఆయనకు భార్య నీరా బెనగళ్, కూతురు ప్రియా బెనగళ్ ఉన్నారు. ప్రియా బెనగళ్ పలు చిత్రాలకు కస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ప్రస్తుతం శ్యామ్ బెనగళ్ ‘ముజీబ్: ది మేకింగ్ ఏ నేషన్’ సినిమా కోసం పని చేస్తున్నారు. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే, వివాదాల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్నది.