విజయాలకు, ధైర్య సాహసాలకు చిరునామా.. భారత సైన్యం! అలాంటి ‘కేరాఫ్ అడ్రస్’ నుంచి వచ్చిన తారల కెరీర్కూడా.. అంతే సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నది. జవాన్ల ఇంట పుట్టి, ఆర్మీ పరిసరాల్లో పెరిగి.. సినిమా రంగంలో సత్తా చాటుతున్నారు కొందరు అమ్మాయిలు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వారిలో కొందరి పరిచయం..
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి.. అగ్రతారగా వెలుగొందింది రకుల్‌ప్రీత్ సింగ్. ఈమెది ఆర్మీ ఫ్యామిలీ! రకుల్ తండ్రి రాజేందర్ సింగ్.. భారత సైన్యంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. రకుల్ విద్యాభ్యాసం కూడా ఆర్మీ పబ్లిక్ స్కూల్లోనే సాగింది. అందుకే, అవిశ్రాంతంగా పనిచేయడం, లక్ష్యాలను సాధించేవరకూ పట్టువిడవకపోవడం తనకు బాల్యం నుంచే అబ్బాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది రకుల్.
1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన సుస్మితా సేన్‌ది ఆర్మీ కుటుంబమే. మోడల్‌గా, ఆ తర్వాత యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించింది సుస్మిత. ఈమె తండ్రి షుబీర్ సేన్. వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేశారు.
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ అగ్రతార.. అనుష్క శర్మ. ఈమె తండ్రి భారత మాజీ ఆర్మీ అధికారి, కల్నల్ అజయ్ కుమార్ శర్మ. ఈయన ఆపరేషన్ బ్లూస్టార్, కార్గిల్ యుద్ధం సహా అనేక సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తన తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నప్పుడు చాలా భయపడ్డామనీ, ప్రాణనష్టం గురించి వార్తలు విన్నప్పుడు ఎంతో బాధపడ్డామనీ గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది అనుష్క. సైనికులు, వారి కుటుంబాలు చేసే త్యాగాలను స్వయంగా చూసిన ఈ నటి.. భారత సైన్యానికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెబుతుంది.