Ajith | చెన్నై నగరంలో గత కొద్ది రోజులుగా వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు వచ్చిన ఈ బెదిరింపులపై పోలీసులు అప్రమత్తమయ్యారు.తాజాగా, మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్, అలాగే ఈసీఆర్లో ఉన్న హీరో అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిలిం సిటీ సహా పలు ప్రాంతాలకు డీజీపీ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, పరిశీలన అనంతరం ఏ విధమైన పేలుడు పదార్థాలు లేవని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, నటుడు ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకూ ఇలాంటి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఇదే తరహాలో, సోమవారం నటి త్రిష ఇల్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం కూడా బాంబు బెదిరింపుల జాబితాలో చేరాయి.పోలీసులు ఈ ఘటనలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు ఇమెయిల్ ట్రేసింగ్, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన వంటి సాంకేతిక చర్యలు చేపట్టారు.ఈ సంఘటనలతో చెన్నై నగరంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, పుకార్లను నమ్మవద్దని సూచించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ ఎర్రకోట దగ్గర రన్నింగ్ కారులో బాంబు పేలిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యపెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన డా.ఉమర్దిగా కారు గుర్తించారు.