పరిమితులను గుర్తించి పనిచేస్తే.. ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అంటున్నది బాలీవుడ్ వెటరన్ స్టార్ రిమీ సేన్. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ధూమ్ ఫేమ్ జాన్ అబ్రహం పేరును ప్రస్తావిస్తున్నది. ధూమ్, హేరా ఫేరీ, హంగామా, గోల్మాల్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన రిమీ సేన్.. ప్రస్తుతం దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నదట. తాజాగా, అక్కడి ఓ రియల్ ఎస్టేట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించింది. ఈ సందర్భంగా దుబాయ్ ముచ్చట్లతోపాటు ధూమ్ సినిమాలో తన సహనటుడైన జాన్ అబ్రహం గురించి పలు ఆసక్తికర విషయాలనూ పంచుకున్నది.
“జాన్ అబ్రహం ఒక మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. అతనికి నటన గురించి ఏమాత్రం తెలియదు. తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చేవి. అయినా, ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. నటన కన్నా.. బాడీ, లుక్స్పైనే ఫోకస్ పెట్టాడు. యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నాడు. తనవైపు ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అందుకే జాన్ చాలా తెలివైన నటుడు” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నది. ఇక సినిమాల్లో ఒక్కసారి క్రేజ్ వచ్చాక, సెట్లో, కెమెరా ముందు సమయం గడిపే కొద్దీ.. ఎవరైనా నటన నేర్చుకుంటారని రిమీసేన్ చెప్పుకొచ్చింది. “జాన్ కూడా అలాగే చేశాడు. మెల్లమెల్లగా యాక్టింగ్ నేర్చుకున్నాడు.
పాపులారిటీ పెరిగిన తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశాడు” అంటూ వెల్లడించింది. దుబాయ్ నగరం గురించి చెబుతూ.. ఈ ఎడారి నగరం అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుందనీ, ఇక్కడి జనాభాలో 95 శాతం మంది ప్రవాసులేనని పేర్కొన్నది. తన లుక్ పూర్తిగా మారిపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకూ సమాధానాలు ఇస్తూ.. తానేమీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదనీ, బ్యూటీపై కేర్ తీసుకోక పోవడంతో ముఖం కొంత రంగు మారిందని చెప్పుకొచ్చింది. తన రూపాన్ని మార్చుకోవడానికి తానేమీ నేరాలు చేయలేదంటూ చెప్పుకొచ్చింది. బెంగాల్‌కు చెందిన రిమీసేన్.. సినిమా రంగంపై ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది.
2000లో బెంగాలీ సినిమా ‘పరోమితార్ ఏక్ దిన్’ చిత్రం ద్వారా హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. 2001లో తెలుగులో అవకాశం దక్కించుకున్నది. తర్వాత అందరివాడులో మెగాస్టార్ సరసన ఆడిపాడింది. ఇటు బాలీవుడ్‌లోనూ ‘హంగామా’ చేసి, అమితాబ్ సినిమాలో అవకాశం కొట్టేసింది. ఆ తర్వాతి చిత్రం ‘ధూమ్’ భారీహిట్ కొట్టడంతో.. కెరీర్లో జెట్స్పీడ్తో దూసుకెళ్లింది. అనేక సినిమా ఆఫర్లు దక్కించుకుంది. కానీ, వాటిలో ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవిచూడటంతో.. రిమీ జోరు తగ్గింది.