సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి అభిమానులు విలువ ఇవ్వాలని కోరుతున్నది బాలీవుడ్ తార అనుష్క శర్మ. తాజాగా తన భర్త విరాట్ కొహ్లీ హోటల్ గది దృశ్యాలను చిత్రీకరించి లీక్ చేసిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు ఆట వస్తువులు అనుకుంటున్నారా అని మండిపడింది. అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…‘తమకు ఇష్టమైన తారలను చూడాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు.
వారి ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి ఒక్కరికి స్వీయ నియంత్రణ ఉండాలి. సెలబ్రిటీలకు ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని అర్థం చేసుకోండి. మా హోటల్ గదిలోనూ గోప్యత లేకుంటే ఏం చేయగలం. గతంలోనూ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు పడ్డాం. కానీ ఇది వాటన్నింటికంటే బాధకు గురిచేసింది. ఇదేవిధంగా మీ గదిలోని దృశ్యాలు బయటకొస్తే ఏం చేస్తారు. మనకొక హద్దు ఉండక్కర్లేదా?’ అని పేర్కొంది. క్రికెటర్ కొహ్లీ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.