AmeeshaPatel | ముంబైలో ఇటీవల జరిగిన ‘స్క్రీన్ అవార్డ్స్’ వేడుక ఇప్పుడు బాలీవుడ్లో వివాదానికి దారితీసింది. వేదికపై స్టాండప్ కమెడియన్ జాకీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి అమీషా పటేల్ మరియు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన జాకీర్ ఖాన్, ‘ధురంధర్’ సినిమా విజయం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా సక్సెస్ చూసి పరిశ్రమలోని కొందరికి అసూయ కలుగుతోందని అర్థం వచ్చేలా ఒక జోక్ వేశారు. “సినిమాలో బాంబులు ల్యారీలో పేలితే, దాని పొగ మాత్రం బాంద్రా నుంచి జుహూ వరకు (బాలీవుడ్ ప్రముఖులు నివసించే ప్రాంతాలు) వచ్చిందంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌ని పలువురు తప్పుబడుతుండగా.. తాజాగా నటి అమీషా పటేల్ స్పందించింది.
జాకీర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన అమీషా.. అనవసరంగా నెగిటివిటీని వ్యాప్తి చేయవద్దని కోరింది. పరిశ్రమ ఎప్పుడూ ‘ధురంధర్’ వంటి సినిమాలను గౌరవిస్తుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్ వంటి సూపర్ స్టార్లు కెరీర్లో ఒకటి కాదు.. 25కు పైగా మెగా హిట్లను ఇచ్చారు. వారు భవిష్యత్తులోనూ అదే కొనసాగిస్తారు. ‘గదర్’ లాంటి ప్రకంపనలు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి అంటూ ఆమె గట్టిగా సమాధానమిచ్చారు.
ఇక ఇదే విషయంపై ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా స్పందిస్తూ.. గత 50 ఏళ్లుగా జుహూ-బాంద్రా ప్రజలే ఇండస్ట్రీకి ఎన్నో ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ (ATBB) చిత్రాలను అందించారు. వారి సహకారాన్ని తక్కువ చేసి మాట్లాడటానికి ఎవరో ఒక మూర్ఖుడై ఉండాలి అంటూ ఆయన విమర్శించారు. ఇప్పటికే జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేది, నటుడు రాజ్‌పాల్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదంలో ఉన్న ఈ అవార్డుల వేడుక, ఇప్పుడు జాకీర్ ఖాన్ వ్యాఖ్యలతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.