బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నది. విరహమో, విరక్తో తెలియకుండా ఆమె రాసుకొచ్చిన చిన్న కవిత.. శ్రద్ధా అభిమానులలో ఆసక్తితోపాటు ఆందోళననూ రేకెత్తిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నది శ్రద్ధా కపూర్. ఆ సినిమా విజయంతో.. ఇక శ్రద్ధ దశ మారిపోయినట్లేనని, ఆఫర్లు క్యూ కడతాయని అందరూ ఊహించారు. కానీ, ‘స్త్రీ-2’ సక్సెస్‌ను శ్రద్ధా క్యాష్ చేసుకోలేక పోయినట్లే కనిపిస్తున్నది. అందులోనూ.. ఆమె వ్యక్తిగత జీవితం కూడా కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. సినీ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా డేటింగ్ చేస్తున్నదనీ, ఈ ఏడాదే వీళ్లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త బీటౌన్‌లో షికారు చేసింది. అయితే, ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్.. ఈ అంచనాలను పటాపంచలు చేసింది.
‘నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు..
నేను నీ పక్కన కూర్చుంటాను.
నువ్వు విచారంగా ఉన్నప్పుడు..
నేను నిన్ను దగ్గరికి తీసుకోడానికి వస్తాను.
నువ్వు తప్పిపోతావని నాకు తెలుసు..
నువ్వు పారిపోతావనీ తెలుసు..
కానీ, నేను నిన్ను కచ్చితంగా కనుక్కుంటాను.
నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను..’
అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది శ్రద్ధా కపూర్. కొంచెం బాధ, ఇంకొంచెం ప్రేమ కలగలసిన ఈ పోస్ట్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినా.. శ్రద్ధా కపూర్‌కు రావాల్సినంత స్టార్డమ్ దక్కలేదని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆమె ఇంకా కష్టపడుతూనే ఉన్నదని అంటున్నారు. ఇక బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలైన ధర్మ ప్రొడక్షన్స్, యష్‌రాజ్ ఫిల్మ్స్.. రెండూ శ్రద్ధాకు అవకాశం ఇవ్వడం లేదని మరికొందరు ఆరోపిస్తున్నారు.
అలియా భట్, దీపికా పదుకొణె స్థాయిలో శ్రద్దా కపూర్‌కు అగ్రస్థాయిలో మద్దతు లభించడం లేదని, అందుకే.. ఆమె బాలీవుడ్‌పై నిశ్శబ్ద పోరాటం చేస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇది విచారకరమైన పోస్ట్ కాదనీ, రొమాంటిక్ పోస్ట్ అంటూ పలువురు చర్చిస్తున్నారు. ఏదేమైనా, శ్రద్ధా కపూర్ పెట్టిన పోస్ట్.. ఇప్పుడు బీటౌన్‌ను ఆలోచనలో పడేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. వైవిధ్యమైన చిత్రాలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నదీ నటి. 2024లో విడుదలైన ‘స్త్రీ-2’లో చివరిసారిగా కనిపించింది. ఇక ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలోనూ శ్రద్ధాకపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.