తారలపైనే కాదు.. వారి వ్యక్తిగత జీవితాలపైనా నిత్యం లైమ్లైట్లు పడుతూనే ఉంటాయి. వారికి సంబంధించిన వార్తలతోపాటు లేనిపోని పుకార్లు కూడా షికారు చేస్తుంటాయి. అందులోనూ ‘బాలీవుడ్ కపుల్స్’ గురించిన ముచ్చట్లు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా. తన భర్త, బాలీవుడ్ నిర్మాత-దర్శకుడు విపుల్ షాతో ఆమె విడిపోతున్నదంటూ.. సోషల్ మీడియా కోడై కూసింది.
ఇద్దరి మధ్యా దూరం పెరిగిందనీ, త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కనున్నారనే వార్త.. నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే, తాజాగా ఒకేఒక్క వీడియోతో ఆ గాలివార్తలకు అడ్డుకట్ట వేసింది షెఫాలీ షా. తమ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. విడాకుల పుకార్లకు తెరదించే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. ఈ పుకార్లకు కారణమైన ఘటన గురించి కూడా వివరణ ఇచ్చింది. పెళ్లిరోజు వేడుకల కోసం వెళ్తున్నప్పుడు విమానంలో జరిగిన ఒక సంఘటనను షెఫాలీ తన పోస్టులో ప్రస్తావించింది. ‘మాది 25 ఏండ్ల వైవాహిక ప్రయాణం.
విమానంలో ఇద్దరం పక్కపక్కన కూర్చునే సీట్లు ఉన్నా.. నేను వేరే సీటును ఎంచుకున్నాను. ఎందుకంటే.. నేను విండో సీటును ఇష్టపడతాను. కాళ్లు ఫ్రీగా ఉంటేనే ఆయన కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అయితే, ఆ విమానంలో మాకు కావాల్సినట్లు పక్కపక్క సీట్లు దొరకలేదు. అందుకే.. వేర్వేరుగా కూర్చున్నాం. దానివల్ల ఇద్దరికీ కంఫర్ట్ దొరికింది’ అంటూ రాసుకొచ్చింది షెఫాలీ. ‘సర్దుకుపోవచ్చని కొందరు అనొచ్చు. కానీ, మన ఇష్టాన్ని చంపుకోవడం పెళ్లికి నిదర్శనం కాదు.
చేతికి చేయి ఆనించుకుని కూర్చున్నంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు. దూరదూరంగా కూర్చున్నంత మాత్రాన.. ఏదో జరిగిపోతున్నదనీ కాదు. స్పేస్ ఇవ్వడం అంటే.. దూరం పెట్టడం కాదు’ అంటూ దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన స్పేస్ గురించి పలు కీలక సూచనలు చేసింది. ఇక తమ 25 ఏండ్ల వైవాహిక జీవిత ప్రయాణాన్ని డ్యాన్స్‌తో పోల్చి చెప్పింది.
తమ పెళ్లి కూడా అందరిలాగే ఎత్తుపల్లాలు, కష్టసుఖాలతో సాగిందనీ, పాతికేండ్లుగా తామిద్దరం కలిసి రకరకాల డ్యాన్సులు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు తడబడ్డామనీ, మరికొన్ని సార్లు లేచి నిల్చున్నామంటూ ఎమోషనల్ అయ్యింది. టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన షెఫాలీ.. రంగీలా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల నెట్‌ఫిక్స్‌లో విడుదలైన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 3’లో డీసీపీ వర్తికా చతుర్వేదిగా మెప్పించింది.