బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాల విశేషాలతో పాటు వ్యక్తిగత అంశాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆయన తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో భాగం కాబోతున్నారు. ‘డంబ్ బిర్యానీ’ పేరుతో ఆయన మేనల్లుడు అర్హాన్ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొనబోతున్నారు.
ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ‘ఈ పాడ్‌కాస్ట్‌లో చాలా కొత్త విషయాలను చెప్పాను. అవి నేటి యువతకు ఉపయోగపడుతాయనుకుంటున్నా. తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.