Bollywood | ప్రతి ఏడాది ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి రోజు కూడా ఏదో ఒక మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని మ్యాచ్‌లపై అయితే ప్రత్యేక దృష్టి ఉంటుంది. మూడు నెలల పాటు జరగనున్న ఈ ఐపీఎల్ మంచి మజా అందిస్తునడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాల రిలీజ్ కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో చాలా మంది క్రికెట్ చూసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. రిస్క్ చేసి తమ సినిమాలని రిలీజ్ చేస్తే లేని పోని సమస్యలు వస్తాయని కాస్త ఆలోచిస్తుంటారు.
కాని ఇప్పుడు ముగ్గురు బాలీవుడ్ హీరోలు ఐపీఎల్‌కి ధీటుగా తమ మూవీస్‌ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ‘సికందర్’ సినిమాను విడుదల చేయబోతున్నాడు. మార్చి 30వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఐపీఎల్ నడుస్తున్న సమయంలో మూవీని తీసుకు రావడం అనేది కచ్చితంగా పెద్ద రిస్క్ అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతుంది. ఇక సల్మాన్ మాత్రమే కాకుండా అక్షయ్ కుమార్, సన్నీ డియోల్ సైతం ఐపీఎల్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చాప్టర్ 2 సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. సూపర్ హిట్ కేసరి ప్రాంచైజీలో రాబోతున్న ఈ సినిమాకి పాజిటివ్ బజ్ అయితే ఉంది కాని ఈ మూవీ ఐపీఎల్‌తో పోటీ పడుతుందా అనే సందేహం అందరిలో ఉంది. జలియన్ వాలాబాగ్ నేపథ్యంలో రూపొందిన సినిమా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా జాట్ సినిమా రూపొందింది. ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమాకి సైతం ఐపీఎల్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సౌత్ భాషల్లోనూ కొన్ని క్రేజీ సినిమాలు ఐపీఎల్ సీజన్లో రానున్నాయి. వాటిపై కూడా ఐపీఎల్ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వాటిని ఎలా తట్టుకుంటారో చూడాలి.