బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న క్రీడా నేపథ్య చిత్రం ‘మైదాన్’ మరోసారి విడుదల వాయిదా పడింది. ఇలా ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అవడం ఇది ఎనిమిదోసారి. 2020 నవంబర్ నుంచి ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది. భారత ఫుట్‌బాల్ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన తెలంగాణ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది.
భారత ఫుట్‌బాల్ జట్టు మేనేజర్‌గా రహీమ్ సేవలందించారు. ఆధునిక భారతీయ ఫుట్‌బాల్ రూపశిల్పిగా ఆయన్ను చెప్పుకుంటారు. ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 23న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. సినిమాకు పనులు పూర్తి కానందునే రిలీజ్ చేయలేకపోతున్నట్లు తెలుస్తున్నది.