తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను హిందీ (Bollywood)లో రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. అయితే తెలుగు వెర్షన్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం సర్వసాధారణమైపోయింది. ఈ జాబితాలో తాజాగా అల వైకుంఠపురంలో (Ala Vaikuntapurramlo) హిందీ రీమేక్ షెహ్జాదా (Shehzada) కూడా చేరిపోయింది. మహాశివరాత్రి లాంటి పెద్ద హాలీ డే వచ్చినా ఈ సినిమాకు అంతగా కలిసిరాలేకపోయింది.
ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గతంలో భారీ అంచనాల మధ్య హిందీలో రీమేక్ అయిన హిట్, జెర్సీ సినిమాలు బీటౌన్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. హిట్, జెర్సీ తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. హిందీలో మాత్రం ఊహించని ఫలితాన్ని అందుకున్నాయి. ఇపుడు తాజాగా ఇదే లైన్లో షెహ్జాదా కూడా చేరిపోయింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో బాలీవుడ్ వరుసగా మూడు రీమేక్ ఫ్లాప్స్ మూటగట్టుకొని హాట్రిక్ కొట్టేసిందంటూ బీటౌన్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.
తెలుగులో హిట్, జెర్సీ సినిమాలు తెరకెక్కించిన దర్శకులు శైలేష్ కొలను, గౌతమ్ తిన్ననూరి.. హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించారు. అయితే ఒరిజినల్ వెర్షన్లో ఉన్న ఫ్లేవర్ హిందీలో మిస్సవడం వల్ల ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా.. హిందీ వెర్షన్ షెహ్జాదా ను రోహిత్ ధవన్ డైరెక్ట్ చేశాడు.
షెహ్జాదా సినిమా విషయంలో డైరెక్టర్ మారినా ఫలితం మాత్రం అంత మాత్రంగానే ఉండటంతో.. ఇక భవిష్యత్‌లో డైరెక్టర్లు తెలుగు సినిమాలు రీమేక్ చేసే సాహసం చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.