‘తొలిచూపులోనే ప్రేమ’ అనే కాన్సెప్ట్‌పై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి, జీవిత భాగస్వామ్య బంధాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఒక చూపులోనో, ఒక రోజులోనో బంధాలనేవి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడ్డాయనుకుంటే.. అదంతా కేవలం ఓ భ్రమ. ఇంకా మాట్లాడితే అర్థరహితం’ అంటూ కొట్టిపారేసింది కంగనా రనౌత్. ఇంకా చెబుతూ ‘అర్థం చేసుకుంటూ ముందుకు సాగే క్రమంలో బంధాలనేవి బలపడతాయి. అదంతా కాలం చేసే మ్యాజిక్. ఈ ప్రపంచంలో అర్థం చేసుకునే మనిషి దొరకడమే అరుదైన విషయం. ఒకవేళ దొరికితే ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరస్పర గౌరవం, సర్దుబాటు ధోరణి ప్రతి ఒక్కరికీ ముఖ్యం. నైతిక విలువలు, నమ్మకం ఉన్నప్పుడే వైవాహిక జీవితం విజయవంతం అవుతుంది. సినిమాల్లో చూపించే కథలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.