Deepika Padukone | ‘మనిషికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసికంగా బలంగా లేకపోతే.. శారీరకంగా కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. మెదడు నుంచి శరీరానికి పాజిటీవ్ సిగ్నల్స్ వెళ్లాలి కానీ.. నెగెటివ్ సిగ్నల్స్ వెళ్లకూడదు. అలా జరిగితే ప్రమాదంలో పడతాం.’ అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ భామ దీపికా పదుకొణె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్నేళ్ల క్రితం మానసికంగా తాను ఎదుర్కొన్న సమస్యల్ని ఆమె గుర్తుచేసుకున్నది.
‘2014లో కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నా. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న రోజులవి. పైగా అన్ని విషయాల్లోనూ ఆనందంగా ఉన్నా. అలాంటి సమయంలో ఓసారి తీవ్ర అలసటకు గురై లొకేషన్లోనే కళ్లు తిరిగి పడిపోయా. ఇవన్నీ వృత్తిలో భాగమేలే అని ముందు లైట్ తీసుకున్నా. కానీ ఎందుకో మనసు కీడు శంకించడం మొదలుపెట్టింది. అందుకే.. అవసరమైన స్కానింగులు, టెస్ట్‌లు చేయించుకున్నా.
నా పరిస్థితి అంత బాలేదని అర్థమైంది. నిజానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే సమస్యలే అవన్నీ. కానీ ఏదో అయిపోతున్నట్టు భయపడిపోయేదాన్ని. విపరీతంగా ఏడ్చేసేదాన్ని. మానసికంగా కృంగిపోయా. నా విషయం తెలుసుకొని మా అమ్మ నన్ను చూడ్డానికి ముంబయ్ వచ్చింది. అమ్మ సూచన ప్రకారం థెరపిస్ట్‌ని కలిశాను. నేను థెరపిస్ట్ వద్దకు వెళ్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచమని అమ్మ చెప్పింది.
అమ్మమాటను పాటించి, ఎవరికీ తెలీకుండా సీక్రెట్‌గా థెరపీ తీసుకునేదాన్ని. నిదానంగా ఈ రుగ్మత నుంచి తేరుకున్నా. కోలుకున్న తర్వాత అనిపించింది. మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని. ‘లివ్ లాఫ్ లవ్’ ఫౌండేషన్ నేను స్థాపించడానికి కారణం అదే.’ అంటూ గుర్తు చేసుకున్నది దీపిక పదుకొణె.