Hrithik Roshan | బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్‌కు (Hrithik Roshan) ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను వాడుకోకుండా నిషేధం విధించాలని హృతిక్ కోర్టును ఆశ్రయించగా.. ఈ కేసుపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడాలని కోరుతూ హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్లో తన పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు, ఈ-కామర్స్ సంస్థలు వాణిజ్య ఉత్పత్తులను అమ్ముతున్నారని ఏఐ (AI) ద్వారా మార్ఫింగ్ చేసిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే హృతిక్ పిటిషన్ నేడు విచారణకు రాగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం హృతిక్ రోషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇకపై హృతిక్ అనుమతి లేకుండా ఆయన పేరు కానీ, ఫోటోలు, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత లక్షణాలను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. అలాగే ఈ-కామర్స్ వెబ్సైట్లలో హృతిక్ రోషన్‌కి సంబంధించిన ఫోటోలు, ఆయనకు సంబంధించిన అభ్యంతరకరమైన ఏఐ జనరేటెడ్ కంటెంట్ లింక్‌లను తక్షణమే తొలగించాలని న్యాయస్థానం సంబంధిత సంస్థలకు ఆదేశించింది. కాగా, ఇటీవల తెలుగు నటుడు నాగార్జునతో పాటు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.