Dharmendra | భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ఆకస్మికంగా విషమించింది. చివరకు అన్ని ప్రయత్నాలు విఫలమై ఆయన మృతి చెందారు.ఈ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మేంద్రను చివరిసారిగా చూసేందుకు పలువురు సినీ తారలు ఆసుపత్రికి చేరుకున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్, బాబీ డియోల్, ఆయన భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్ సహా పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. 1958లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్‌పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, అద్భుతమైన స్టైల్‌తో ఆయనకు అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు.
ఆయన మరణం బాలీవుడ్‌కు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ .. “ఒక యుగం ముగిసింది… ధర్మేంద్ర గారి చిరునవ్వు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం ‘ఇక్కీస్ (Ikkis)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. మరోవైపు డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజు జరుపుకోబోతున్న ధర్మేంద్ర ఇలా కన్నుమూయడంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.