Thandel | నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్‌హిట్ మూవీ ‘తండేల్’ (Thandel) ఓటీటీలో విడుదలైంది. బుజ్జితల్లీ అంటూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్రిబవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాతో నాగచైతన్య వంద కోట్ల గ్రాస్‌ను అందుకున్నాడు. ఇక సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్న ప్రేక్షక్షులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. మార్చి 7న స్ట్రీమింగ్ చేయన్నట్లు ఇటీవలే ప్రకటించింది. అన్నట్లుగానే శుక్రవారం ఉదయం నుంచి స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంచింది. కాగా, థియేటర్స్‌లో మెప్పించిన తండేల్ ఇక ఓటీటీ లవర్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్యం గ్రామానికి చెందిన జంట రాజు (నాగచైతన్య), సత్య (సాయిపల్లవి). ఇద్దరూ మత్యకారుల కుటుంబాలకు చెందినవారే. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగారు. కలిసి బతకాలనుకున్నారు. సత్యకు రాజు అంటే ప్రాణం. రాజుకు సత్యే లోకం. రాజు చేపల వేటకు వెళ్లి నెలల తరబడి రాకపోయినా.. అతని జ్ఞాపకాలతో బతికేస్తుంది సత్య. తనవారికోసం నిలబడే తెగువ, ధైర్యం, మంచితనం.. ఇవన్నీ రాజును తమ జాతికి తండేల్గా నిలబెట్టాయ్. అయితే.. చాపలవేటకు వెళ్లి సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న తనవాళ్లను చూస్తూ సత్య మనసులో కలవరం మొదలైంది. ఎలాగైనా రాజుతో చేపలవేట మాన్పించాలని ప్రయత్నించింది. కానీ.. రాజు మాత్రం సత్య మాట వినలేదు. బాధ్యతకోసం కట్టుబడి, తనను నమ్మకున్నవారి కోసం వేటకు వెళ్లాడు.దీంతో సత్య మనసు గాయపడింది.
తన మాటను పెడచెవిన పెట్టిన రాజును మనసులోంచి చెరిపేయాలనుకుంది. మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. ఇంతలో పిడుగులాంటి వార్త. సముద్రంలో చేపలవేటకు వెళ్లిన రాజు బృందం.. అక్కడ తుఫాన్లో చిక్కుకొని, అందులోంచి బయట పడే ప్రయత్నంలో తమ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి పాకిస్తాన్ నేవీ అధికారులకు దొరికిపోయారు. ఈ వార్త విని మత్స్యలేశం గ్రామం విలవిలలాడింది. సత్య షాక్‌కు గురైంది. మరి పాకిస్తాన్ కరాచీ సెంట్రల్జైల్లో బంధీలుగా ఉన్న రాజు బృందం ఎలా బయటపడింది? సత్య వేరొకరిని పెళ్లాడిందా? శత్రుదేశంలో బంధీగా చిక్కుకున్న రాజుకోసం సత్య చేసిన ప్రయత్నాలేంటి? చివరకు సత్య, రాజుల ప్రేమకథ సుఖాంతమైందా? దుఖాంతంగా మిగిలిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.