Subhashree Rayaguru | బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు, ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతోంది. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభశ్రీ వెల్లడించింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందనే క్యాప్షన్‌ను జోడించింది.
ఈ నిశ్చితార్థ వేడుకలోనే అజయ్ మైసూర్, శుభశ్రీ కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌ను లాంఛ్ విడుదల చేశారు. సాయికుమార్ వాయిస్‌తో ప్రారంభమైన ఈ పాట ఆ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌ను సిద్ధార్థ్ వాట్కిన్సన్ స్వరపరచగా.. సాహితీ చాగంటి ఆలపించారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే అజయ్, శుభశ్రీ మనసులు కలిశాయి. తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శుభశ్రీ, అజయ్ మైసూర్ ఎంగేజ్మెంట్తో పాటు మెహందీ, సంగీత్ రిసెప్షన్ కార్యక్రమాలను కూడా వైభవంగా నిర్వహించారు. జూలైలో ఆస్ట్రేలియాలో అజయ్, శుభశ్రీ వివాహం జరగనుంది. కాగా, నిశ్చితార్థ వేడుకకు ప్రముఖ నటులు సాయికుమార్, సోహైల్, ఇతర బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, పలువురు సెలబ్రెటీలు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Shubashree
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. అజయ్ మైసూర్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పాడు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్‌కు పనిచేసిన బృందం కూడా ఈ నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని పాట పాడి వీక్షకులను అలరించారు. ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ తన బ్యానర్ (అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్)పై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు నిర్మించారు. పలు షార్ట్ ఫిలింస్, 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్ల్లోనూ నటించారు.