Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు నామినేషన్ల ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో హౌస్ మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు తమకు హౌస్‌లో ఉండకూడదనిపించే సభ్యులను నామినేట్ చేస్తూ తమ వాదనలు వినిపించారు. నామినేట్ అయిన వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుంటే బురదనీటితో తడిపే విధానం ఈసారి ప్రేక్షకులకు కొత్త ఎంటర్టైన్మెంట్ అందించింది. మొదటగా తనూజ, గౌరవ్‌ను నామినేట్ చేస్తూ—“గౌరవ్ ఏ విషయంలోనూ క్లారిటీ చూపడం లేదు” అని కారణం చెప్పింది. దీనికి గౌరవ్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.
తర్వాత భరణి, దివ్యను నామినేట్ చేయడం విశేషంగా మారింది. “నా గేమ్ పాడవ్వడానికి దివ్య కారణమని హౌస్‌లో మాట్లాడుకుంటున్నారు. అది తప్పు అయితే దివ్య తాను నిరూపించుకోవాలి” అంటూ భరణి చెప్పడంతో దివ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. “నా వల్ల మీ గేమ్ పాడైందా? ఇది ఏ రకమైన కారణం?” అంటూ భరణిపై విరుచుకుపడింది.తదుపరిగా సంజన కూడా గౌరవ్ పేరే చెప్పింది. ఇక నిఖిల్ మాత్రం రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. “రీతూ నన్ను కెప్టెన్ అవ్వనివ్వలేదు, నన్ను వేస్ట్ అని అవమానించింది” అని నిఖిల్ ఆరోపించాడు. నామినేషన్స్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. “ఈ వారం నేను అనుకున్న విధంగానే నామినేషన్స్ జరుగుతాయి. హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ నేను నామినేట్ చేస్తున్నా” అని ప్రకటించారు.
అయితే కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కి మినహాయింపు ఇవ్వాలా లేదా అనేది సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని చెప్పారు. ఆ ఓటింగ్‌లో భరణి తప్ప మిగతా అందరూ ఇమ్మాన్యుయేల్‌కి మద్దతు ఇవ్వడంతో ఆయన నామినేషన్స్ నుంచి బయటపడ్డారు.అందువల్ల ఈ వారం ఇమ్మాన్యుయేల్‌ను మినహాయించి హౌస్‌లో ఉన్న మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఎవరి గేమ్‌కి ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా లభిస్తుందో చూడాలి. ఈ ఎపిసోడ్‌తో బిగ్ బాస్ హౌస్‌లో హీటు మళ్లీ పెరిగింది. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌజ్‌లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి!