‘ది రాయల్స్’ వెబ్‌సిరీస్‌లో తన నటనపై వచ్చిన విమర్శలు.. తనను తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నది బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్. ఆ విమర్శలకు తన మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయిందనీ, తాను కోలుకోవడానికే 9 నెలలు పట్టిందని వాపోయింది. గతేడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన ‘ది రాయల్స్’ సిరీస్.. మంచి విజయాన్ని నమోదు చేసింది. కానీ, అందులో కీలకపాత్ర పోషించిన భూమి నటనపై.. సామాజిక మాధ్యమాల్లో దారుణంగా ట్రోల్ అయింది. ఈ క్రమంలో తన కెరీర్లో ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆ చేదు జ్ఞాపకాలను పంచుకున్నది.
“ది రాయల్స్ సిరీస్‌లో నా నటనపై చాలామంది నన్ను ట్రోల్ చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా అనేక విమర్శలు గుప్పించారు. ఆ ట్రోల్స్, వ్యాఖ్యలతో నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఆ విమర్శల తాకిడికి నా అస్తిత్వాన్నే కోల్పోయినట్లు అనిపించింది. అసలు నేను నటించగలనా? నాలో ఆ సత్తా ఉందా? అని నాపై నాకే సందేహం కలిగింది. అందుకే, గతేడాది కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది” అంటూ వెల్లడించింది. ఆ ట్రోల్స్ వల్ల తొమ్మిది నెలలపాటు కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిందట భూమి. కావాలనే అన్ని రోజులు విరామం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడంతోపాటు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కోర్సు కూడా పూర్తి చేసినట్లు తెలిపింది.
తన జీవితానుభవాలను మళ్లీ పెంచుకోవడానికి ఈ సమయం ఎంతో ఉపయోగపడిందని అంటున్నది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక రాజకుటుంబం నేపథ్యంలో.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది ‘ది రాయల్స్’ వెబ్‌సిరీస్. తమ వారసత్వ భవనాన్ని లగ్జరీ రిసార్ట్‌గా మార్చే కథాంశంతో సాగుతుంది. ఇషాన్ ఖట్టర్, జీనత్ అమన్ వంటి హేమాహేమీలు ఈ సిరీస్‌లో నటించారు. మొదటి సీజన్‌కు మంచి గుర్తింపు రాగా.. రెండో సీజన్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్కు రానున్నది. ఇక భూమి పెడ్నేకర్ విషయానికి వస్తే.. చాలా రోజుల విరామం తర్వాత.. భూమి మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘దల్ దల్’ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నది.
2015లో రొమాంటిక్ డ్రామా ‘దమ్ లగాకే హైస్సా’తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా కోసం 30 కిలోల బరువు పెరిగింది. రెండో సినిమాకే స్టార్హీరో అక్షయ్‌కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది భూమి పడ్నేకర్.