Cinema News | “భూతద్దం భాస్కర్ నారాయణ’ డిటెక్టివ్ థ్రిల్లర్స్‌లో విభిన్నమైన చిత్రం. డిటెక్టివ్ కథను పురాణాలతో ముడిపెట్టిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది’ అన్నారు స్నేహాల్, శశిధర్. వారిద్దరు నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా నటించారు. పురుషోత్తం రాజ్ దర్శకుడు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్మాతలు స్నేహాల్, శశిధర్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది. ఈ కథలోని మైథలాజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతాయి. అదే సమయంలో డిటెక్టివ్ పరిశోధన కూడా కొత్తరకంగా అనిపిస్తుంది. గూఢచారి పాత్రలో శివ కందుకూరి అద్భుతంగా ఒదిగిపోయాడు. నేచురల్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఓటీటీ, ఓవర్సీస్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది.
ఇళ్ల ముందు దిష్టిబొమ్మను పెట్టుకోవడం ఓ ఆచారంగా వస్తున్నది. అయితే దానివెనకున్న అసలు కథేమిటో చాలా మందికి తెలియదు. ఈ పాయింట్‌కు ఫాంటసీ ఎలిమెంట్‌ను జోడించి దర్శకుడు ఈ సినిమాను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించాడు. ఇందులో శివ ట్రాన్స్సాంగ్ లిరికల్ వీడియో కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించాం. శ్రీచరణ్ అందించిన బీజీఎమ్ మరో స్థాయిలో ఉంటుంది.