Bheems Ceciroleo | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి నేడు ఈ స్థాయికి చేరుకున్న ఆయన, ఎంత ఎదిగినా కొత్త టాలెంట్‌కి ప్రోత్సాహం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. అదే ధోరణిలో ‘మాస్ జాతర’ అనే చిత్రంతో యంగ్ రైటర్ భాను బొగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం రవితేజ కెరీర్లో 75వ సినిమా (RT75). ఈ మూవీకి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన చెప్పిన మాటలు వినగానే అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.
“నిన్ను వదిలీ ఉండలేనూ, నిన్ను విడిచీ వెళ్లలేనూ…” అంటూ పాటతో తన స్పీచ్ ప్రారంభించిన భీమ్స్, తన జీవితంలో రవితేజ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు నేను పూర్తిగా వెనకబడ్డాను. ఇంటికి అద్దె ఎలా కట్టాలి? పిల్లలను ఎలా చదివించాలి? రేపు ఎలా బతకాలి? అనే ప్రశ్నలతో చివరి స్థితిలో ఉన్నా. అంతా ముగిద్దామని నిర్ణయించుకున్నా. అదే సమయంలో పీపుల్స్ మీడియా నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ రవితేజ సార్ వల్లే వచ్చింది. ఆయన లేకపోతే ఈరోజు నేను, నా కుటుంబం బ్రతికి ఉండేవాళ్లం కాదు అని ఆవేశంగా చెప్పారు భీమ్స్. ఆ సమయంలో రవితేజ సార్ దేవుడిలా నా జీవితంలోకి వచ్చారు. ఆయన నాకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ నన్ను తిరిగి బ్రతికించింది.
ఈరోజు నా చేతిలో ఉన్న ప్రతి విజయం, నా సంగీతం అన్నీ ఆయన ఆశీర్వాదం వల్లే. అమ్మా నాన్నా… ఈరోజు మీ కొడుకు బ్రతికి ఉన్నాడంటే కారణం రవితేజ సార్,” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను సార్‌కి ప్రేమను మాటల్లో కాదు, నా సంగీతంలో చూపిస్తా. చాలామంది అవసరాల కోసం కథలు చెప్తారు, కానీ భీమ్స్ సిసిరోలియో ఉన్నదే చెప్తాడు. సార్ నాకు దేవుడు. ఆయన సినిమాలు రావడం అంటే, నా పాటలకి ప్రాణం రావడం అని భావోద్వేగంగా అన్నారు. చివరగా, సూపర్ డూపర్ హిట్టు సార్! అంటూ పాటతో స్పీచ్ ముగించారు. అయితే భీమ్స్ ఎమోషనల్ కావడంపై రవితేజ స్పందిస్తూ.. భీమ్స్ ఇంత ఎమోషన్ ఏంటావయ్యా ననువ్వు.. నీ ఎమోషన్ తగలెయ్య.. స్క్రీన్ మీద ఇరగదీయబోతున్నాడు మా వాడు.. సౌండ్‌తో సినిమా చూసాను బాగుంది అంటూ మాస్ రాజా కామెంట్స్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ అభిమానులు ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.