‘నా కోసం ఎలాంటి కథలు రాసిపెట్టున్నాయో తెలియదు. అయితే ప్రతీ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేయాలని తపిస్తాను. ‘అరుంధతి’లో అనుష్క చేసిన జేజమ్మలాంటి పాత్రలు చేయాలన్నది నా కోరిక’ అని చెప్పింది భాగ్యశ్రీబోర్సే. ‘మిస్టర్బచ్చన్’ ‘కింగ్డమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ నటించిన తాజా చిత్రం ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మహేష్‌బాబు పి దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పాత్రికేయులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను మహాలక్ష్మి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, అందరూ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుందని చెప్పింది.
‘ఇదొక హీరో అభిమాని కథ. దక్షిణాదికి వచ్చాక ఇక్కడ హీరోలను ఏ స్థాయిలో ఆరాధిస్తారో తెలుసుకున్నా. ఎలాంటి సంబంధం లేకుండా ఓ వ్యక్తిని అంతలా ఎలా ప్రేమిస్తారో అని ఆశ్చర్యపోయా. అభిమానం అనేది డివైన్ ఎమోషన్’ అని చెప్పింది. ఇటీవల విడుదలైన ‘కాంత’ చిత్రంలో తన అభినయానికి మంచి స్పందన లభించిందని, ప్రేక్షకులు నటిగా తన ప్రతిభను గుర్తించారని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో నటిగా సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని భాగ్యశ్రీబోర్సే పేర్కొంది.