‘నిజాం రాజు ఉంగరాలను బాగా ఇష్టపడేవారని చెబుతారు. అందుకే ఈ కథను హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో చూపించాం. ఇది పూర్తిగా కల్పిత కథ. కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు ప్రణీత్ బ్రహ్మాండపల్లి. ఆయన దర్శకత్వంలో శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్‌సాలే’ ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణీత్ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఎక్కువ భాగం పరుగెత్తడమే ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ముందుగా పరుగు, దౌడ్ వంటి టైటిల్స్ అనుకున్నాం కానీ ‘భాగ్ సాలే’ సౌండింగ్ బాగుండటంతో అదే ఫిక్స్ చేశాం.
‘మత్తు వదలరా’ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు శ్రీసింహా అయితేనే పక్కాగా సరిపోతాడనిపించింది. ఈ సినిమాను ఎక్కువగా లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. దాంతో కొన్ని ఇబ్బందులేర్పడ్డాయి. ఇందులో కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది. కరోనా వల్ల వచ్చిన బ్రేక్ నాకు బాగా సహాయపడింది. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చిన క్రైమ్ కామెడీ సినిమాలన్నింటిని చూశా. ఆ ప్రభావంతో మరింత పక్కాగా స్రిప్ట్ రాసుకోగలిగాను. నా తదుపరి చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఓ సాధారణ యువకుడు విజేతగా మారిన వైనాన్ని అందులో చూపించబోతున్నా’ అన్నారు.