Kishkindhapuri | గత కొంతకాలంగా యాక్షన్, హై బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉంటూ, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నాడు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవల భైరవం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో కొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఇటీవలే సెన్సారు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పిల్లలతో పాటు గుండె నొప్పి ఉన్నవారు ఈ సినిమాకు రావోద్దని హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సినిమా ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఫోన్ పట్టుకుంటే సినీ పరిశ్రమ నుంచే తాను తప్పుకుంటానని బెల్లంకొండ శ్రీనివాస్ సవాలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయాలు జరుగకముందే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో చిత్ర బృందం వారి స్నేహితుల కోసం ‘కిష్కింధపురి’ స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షో నుంచి బయటకొచ్చిన టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే..
‘కిష్కింధపురి’ మొత్తం 2 గంటల 5 నిమిషాల నిడివి ఉంది. దర్శకుడు కౌశిక్ హారర్ ఎలిమెంట్స్‌ని చాలా చక్కగా చూపించాడని, అనవసరమైన హంగులకు పోకుండా కథను సూటిగా చెప్పాడని ప్రీమియర్ చూసిన వారు చెబుతున్నారు. సినిమాకు ప్రధాన హైలైట్ అనుపమ పరమేశ్వరన్ నటన అని, ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె దెయ్యం పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టిందని ప్రశంసలు దక్కుతున్నాయి. ఎం.ఆర్. రాజా కృష్ణన్ సౌండింగ్ సినిమాకి మరో బలం. అది ప్రేక్షకులను భయపెట్టడంలో కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ జోనర్ కొత్త అయినప్పటికీ, తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడని టాక్. అయితే, ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లో మాత్రం గూస్బంప్స్ ఖాయమని ప్రేక్షకులు చెబుతున్నారు.
మొత్తంగా ‘రాక్షసుడు’తో హిట్ పెయిర్‌గా నిలిచిన బెల్లంకొండ, అనుపమ జోడీ మరోసారి విజయం సాధించిందని, ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ పడటం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని, బెల్లంకొండ సవాలు గెలిచాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.