Kishkindhapuri | యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. మంగళవారం ఈ సినిమాకు ప్రీమియర్స్ వేయడంతో వాటికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ విడుదలకు ముందే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది ఈ చిత్రం. అయితే భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూసుకుందాం.
కథ
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. వీరు తమ స్నేహితుడితో కలిసి “ఘోస్ట్ వాకింగ్” పేరుతో హాంటెడ్ హౌస్‌లను సందర్శిస్తూ థ్రిల్ కొరుకునే వారికి భయం అనుభుతిని పంచుతూ ఉంటారు. ఇలాంటి టూర్లో భాగంగా మొత్తం 11 మందితో కలిసి కిష్కింధపురిలోని ఒక పాత రేడియో స్టేషన్ ‘సువర్ణమాయ’ కి వెళ్తారు. ఆ పాడుబడిన భవనంలోకి వెళ్లగానే రేడియో నుంచి ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. అది దెయ్యంలా మారిన వేదవతి వాయిస్ అని ఆ తరువాత తెలుస్తుంది. తన రూల్స్‌ని అధిగమించి ఆ భవనంలోకి అడుగుపెట్టిన ఆ 11 మందిని చంపేస్తానని వేదవతి వారిని హెచ్చరిస్తుంది. అనుకున్నట్లుగానే ఆ బృందంలోని ముగ్గురు చనిపోతారు. ఆ తరువాత వేదవతి ఒక చిన్నారిని టార్గెట్ చేస్తుంది. అది గమనించిన రాఘవ్ తన ప్రాణాలకు తెగించి ఆ దెయ్యంతో పోరాడతాడు. మరి ఆ చిన్నారిని రాఘవ్ కాపాడాడా? మిగిలిన వాళ్ల పరిస్థితి ఏమిటి? అసలు వేదవతి ఎవరు? ఎందుకు దెయ్యంగా మారింది? సువర్ణమాయ స్టేషన్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? వీళ్ళందరినీ ఎందుకు చంపాలనుకుంటుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కిష్కింధపురి ఒక హారర్-థ్రిల్లర్ సినిమా. ఇందులో సినిమా మొదటి భాగంలో భయపెట్టే సన్నివేశాలు, రెండో భాగంలో దెయ్యం వెనుక ఉన్న కథను చూపించడం ద్వారా ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించే ప్రయత్నం చేశారు. భయపెట్టే సన్నివేశాలు బాగా ఉన్నప్పటికీ, రెండో భాగంలో థ్రిల్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే, కథనంలో వచ్చే కొన్ని ఊహించని మలుపులు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. సినిమాలో హైపర్ ఆది చెప్పినట్లుగా, “హారర్‌కి లాజిక్ ఉండదు” అన్నట్లుగానే కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, సినిమా ఫస్ట్ హాఫ్‌లో భయానక వాతావరణం, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్, మరియు నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథలోకి వెళ్తే, సువర్ణమాయ రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాకే అసలు కథ మొదలవుతుంది. అక్కడ వినిపించే వేదవతి గొంతు సినిమా హారర్ కోణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రైలులోని పైలట్లను, ఆ తర్వాత ఒకరిని బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసి చంపే సన్నివేశాలు నిజమైన భయాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా, కథానాయిక అనుపమ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్ మరియు క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తాయి. రామాయణం స్ఫూర్తితో పాత్రలకు పేర్లు పెట్టడం బాగున్నప్పటికీ, అది కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు. మొత్తంగా, బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ కథలో కనిపించడం కొత్త అనుభూతినిస్తుంది.
నటీనటులు
బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ జోనర్‌ను ప్రయత్నిస్తూనే, తన యాక్షన్ స్టైల్‌ను వదల్లేదు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, హారర్ సన్నివేశాల్లోనూ మంచి నటన కనబరిచారు. అనుపమ పరమేశ్వరన్ అందంగా కనిపిస్తూనే, రెండో భాగంలో భయపెట్టే పాత్రలో ఒదిగిపోయింది. ఆమె దెయ్యంగా మారే సన్నివేశం ఆకట్టుకుంటుంది. శాండీ మాస్టర్ విశ్రవపుత్ర పాత్రలో అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్‌లో ఆయన కనిపించిన విధానమే భయాన్ని కలిగిస్తుంది. హైపర్ ఆది మరియు సుదర్శన్ సినిమా ప్రారంభంలో సందడి చేసినప్పటికీ, కామెడీ పెద్దగా పండలేదు. సీనియర్ నటి ప్రేమ డీ-గ్లామర్ పాత్రలో జీవించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె పాత్ర ఒక మంచి మలుపునిస్తుంది.
సాంకేతిక అంశాలు
ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. చేతన్ భరద్వాజ్ స్వరపరిచిన పాట బాగుంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి, ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. దర్శకుడు కౌశిక్ ఒక కొత్త కథాంశాన్ని ఎంచుకున్నారు, కానీ కథనంలో మరికొన్ని మెరుగుదలలు అవసరం.
బలాలు
భయపెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం.
కథానాయకుడు, కథానాయికల జోడీ బాగుంది.
బలహీనతలు
సినిమా ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు.
రేటింగ్ 2.75/5