బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్చందు నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. శనివారం హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ పురాతన ఆలయంలో శరీరమంతా రక్తసిక్తమై ఉండగా.. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడా పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారాయన.
బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ కోరలతో ఉన్న వరాహం కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ నడిచే కథ ఇదని, ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థ: మూన్‌షైన్ పిక్చర్స్, రచన-దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి. ‘టైసన్ నాయుడు’ స్పెషల్ పోస్టర్ : బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.