Baunny Vasu |టాలీవుడ్లో సోషల్ మీడియా ట్రోలింగ్ , నెగెటివ్ కామెంట్లు ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. నటులు, నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాలు చేయగా, వాటిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తుండడం ఎంతో బాధిస్తుంది. ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక హీరోయిన్గా తెరకెక్కిన ‘మిత్రమండలి’ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను బన్నీ వాసు తన స్నేహితులతో కలిసి నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ నెటిజన్ల నుంచి మంచి స్పందన పొందింది. అయితే, కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా సినిమాని నిందిస్తూ చెత్త కామెంట్లు చేయడం జరిగింది.
ఈ విషయంపై ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నిర్మాత బన్నీ వాసు, “ఇలాంటి కుట్రలు ఎవరైనా చేసినా, కంటెంట్ బాగుంటే సినిమాని ఆపలేరు. ఎవరు ఎంత కుట్ర చేసినా మా పని కొనసాగుతుంది” అని తెలిపారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . హీరో ప్రియదర్శి కూడా స్పందిస్తూ, “ఒకే అడ్రస్ నుంచి 300 ఫేక్ ఐడీలతో ట్రోలింగ్ జరిగింది. తప్పు చేస్తే విమర్శించడంలో సమస్య లేదు, కానీ ఇలా చేయడం దారుణం. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాము. చట్టం తన పని చేస్తుంది” అన్నారు.ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, దీపావళి సీజన్లో విడుదలవుతున్న మరో మూడు సినిమాల్లో ఒకదానికి సంబంధించిన డిజిటల్ టీమ్ ఈ ట్రోలింగ్ చేశారని సమాచారం.
రీసెంట్గా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన బన్నీ వాసు.. ఒక సినిమాని హిట్ చేయడానికి మరో సినిమా తొక్కాలని చూస్తున్నది ఎవరో తనకి తెలిసింది అంటూ కామెంట్ చేశారు. మిత్ర మండలి మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. టీంలో చాలా మంది నిద్ర లేకుండా పని చేస్తున్నారు. మేం ఇంత కష్టపడి మూవీని తీస్తుంటే కావాలని కొంత మంది అలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నారని మన అందరికీ తెలుసు. కానీ మనలో ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందుకే నేను అలా కాస్త గట్టిగా, ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాను. అలా నేను మాట్లాడిన తరువాత చాలా మంది ఫోన్ చేసి ‘చాలా బాగా మాట్లాడావ్’’ అని అన్నారంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ దీపావళి సీజన్లో ‘మిత్రమండలి’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’, కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, తమిళ డబ్బింగ్ మూవీ ‘డ్యూడ్’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి.