Bala Krishna | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. ఈ విషయం తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది. ఇక సినీ రంగంలో బాలయ్యతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, అలాగే సీనియర్ హీరోయిన్ శోభనకు సైతం పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. కేంద్రం మొత్తంగా 139 మందికి ‘పద్మ’ అవార్డులు ప్రకటించగా, వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.
అయితే నందమూరి నటసింహం, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నారు. తన కుటుంబ సభ్యులు, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రుల సమక్షంలో పద్మ అవార్డును అందుకునేందుకు బాలయ్య ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు బాలయ్య చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ ని అందుకోనున్నాడు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
బాలకృష్ణ అవార్డు అందుకోనున్న తరుణంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు, ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బాలయ్య కెరీర్ చూస్తే బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి నటసింహం ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా మారారు. పద్నాలుగు సంవత్సరాల వయసులో 1974 లో వచ్చిన ‘తాతమ్మకల’ అనే చిత్రంతో బాలయ్య సినీ రంగ ప్రవేశం చేశారు. తన సినీ జర్నీలో బాలయ్య పోషించని పాత్ర నటించని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సాంఘిక, ఫ్యాక్షన్, పౌరాణిక, జానపద, చారిత్రాత్మిక ఇలా అన్ని జోనర్స్ లోను నటించి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. జనవరిలో డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సినిమాలే కాక రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పి పేదలకి తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు బాలయ్య.