BalaKrishna-Taraka Ratna | నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ (Balakrishna) అంటే కోపిష్టి, ఆయన దగ్గరికి వెళ్తే కొడతాడు, తిడతాడు అని ఏవేవో వార్తలు వచ్చేవి. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ‘బాలయ్య ఎంత మంచివాడు’ అంటూ కథలు కథలుగా చెబుతుంటారు. ముఖ్యంగా బాలకృష్ణకు ఒకసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా అతనిని వదిలి వెళ్ళలేరు అనేది అభిమానుల మాట. అందుకే తిట్టినా, కొట్టినా ఆయన దగ్గరే ఉంటారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ‘బాలయ్య ఎంత మంచివాడు’ అనేది తారకరత్న (Taraka Ratna) ఎపిసోడ్ మొదలైన దగ్గరి నుంచే జనాలకు అర్థమైపోయి ఉంటుంది.
బాలకృష్ణ అన్న కొడుకు అయిన తారకరత్న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జనవరి 27వ తేదీన తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఇక అప్పటి నుంచి సుమారు 23 రోజుల పాటు బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కాగా, తారకరత్న హాస్పిటల్లో 23 రోజులు చికిత్స తీసుకుంటే.. బాలయ్య ప్రతి వారం రెండు రోజులు అతడి కోసం కేటాయించి.. షూటింగ్ కూడా ఆపుకొని అన్నీ తానై చూసుకున్నాడు. తారకరత్నకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అన్నింటా ముందుండడమే కాకుండా పెద్దదిక్కుగా నిలిచాడు. ఆయన కుటుంబానికి కూడా అండగా నిలిచాడు. పిల్లల భవిష్యత్తు తన బాధ్యత అని చెప్పి అందరి మనసులు గెలిచాడు బాలయ్య.
తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. ఆయన నిజ జీవితంలో కష్టాల్లో ఉన్న సమయంలోనూ బాలయ్య తోడుగా నిలిచాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరమైన తారకరత్నకు.. అవసరమైన అన్ని సమయాల్లో అండగా నిలబడింది బాబాయి బాలయ్య ఒక్కరే. తన పిల్లల పుట్టిన రోజు వేడుకలకు పిలిస్తే వెళ్లి ఆప్యాయంగా వాళ్లను పలకరించాడు. అలాగే తారకరత్న పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొని అబ్బాయి నునున్నా అన్న భరోసా ఇచ్చేవాడు.
ఇక ఆయన గుండెపోటుతో కింద పడిపోతే.. ఆ జనాల మధ్య అబ్బాయిని బయటికి తీసుకురావడానికి విలవిలలాడిపోయాడు బాలకృష్ణ. ఆసుపత్రికి తరలించిన మరుక్షణం నుంచి మూడు రోజుల వరకు అక్కడే ఉండి కంటికి రెప్పలా తన బిడ్డను చూసుకున్నాడు. చివరికి 23 రోజుల పోరాటం తర్వాత తన అన్న కొడుకు చనిపోతే అక్కడ కూడా ఆయనే ముందున్నాడు.
తారకరత్న కట్టె కాలే వరకు అక్కడ బాలకృష్ణ తప్ప ఇంకెవరు కనిపించలేదు.
అంతెందుకు స్వయానా తారక రత్న తల్లిదండ్రుల కంటే బాలకృష్ణ మాత్రమే అక్కడ కనిపించాడంటే వారిద్దరి మధ్య ఎంత విడదీయరాని అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు తారకరత్న పాడే కూడా మోశాడు బాలయ్య. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పదేపదే కళ్ళను తుడుచుకుంటూ కనిపించాడు. దీన్ని బట్టి తెలుస్తుంది తారకరత్న అంటే బాలకృష్ణకు ఎంత ఇష్టమో. 24 రోజుల తారకరత్న ఎపిసోడ్లో అందరి మనసులు గెలిచిన నిజమైన హీరో బాలకృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకోసం ఇంతగా నిలబడిన బాబాయి కోసం అబ్బాయి బ్రతికి వచ్చుంటే బాగుండేది. కానీ ఆ దేవుడు రాత మరోలా రాశాడు.