హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య (67).. బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా క్లైమాక్స్‌లో మొగిలయ్య పాడిన పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నది. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థికసాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విశమించడంతో నేడు చివరిశ్వాస విడిచారు.