Bala Krishna | సెలబ్రిటీల పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు చేయడం కొత్త కాదు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి మోసం బారినపడ్డారు. బాలయ్య డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఒక వ్యక్తి ప్రజల నుండి విరాళాలు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలయ్యకు తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఫేస్బుక్ ద్వారా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంగా ప్రజలందరికి నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే.. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి.బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అని బాలయ్య తన ఫేస్ బుక్ పోస్ట్‌లో తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇందులో ఆదిపినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించినా, తాజా సమాచారం ప్రకారం విడుదల తేదీలో మార్పు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో బాలయ్య మరో పెద్ద హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.