Bala Krishna | టాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోవైపు తన లైనప్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేనితో NBK111 ప్రాజెక్ట్‌ను శరవేగంగా తెరకెక్కిస్తున్న బాలయ్య, ఆ తర్వాత దర్శకుడు కొరటాల శివతో మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు మరో యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా చేయబోతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ‘సరిపోదా శనివారం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ పేరు ఈ వార్తల్లో ప్రధానంగా వినిపించింది.
సమాచారం ప్రకారం, బాలయ్య కోసం వివేక్ ఆత్రేయ ప్రత్యేక కథను సిద్ధం చేశారని, ఆ కథను బాలకృష్ణకు కూడా వినిపించారని టాక్ వినిపించింది. కథ నచ్చడంతో ఈ కాంబినేషన్‌పై చర్చలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. కొన్ని కారణాల వల్ల బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ముందుకు వెళ్లలేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక అదే కథను వివేక్ ఆత్రేయ మాస్ మహారాజా రవితేజకు వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఈ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ బాలయ్య కోసం సిద్ధమైన కథ ఇప్పుడు రవితేజ చేతికి వెళ్లిందనే ప్రచారం మాత్రం టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మరి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.