HBD Bala Krishna | విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగువారి అభిమాన నటుడిగా మారారు బాలయ్య. తనదైన శైలిలో డైలాగులు చెబుతూ, యాక్షన్‌తో అదరగొడుతూ శ్లోకాలు, పద్యాలని అవలీలగా చెప్పేస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య. బాలయ్య తొడగొడితే రాజసం ఉట్టిపడుతుంది. మీసం మెలేస్తే శూరత్వం తొణికిసలాడుతుంది. డైలాగ్ చెబితే అభిమానులకి పూనకం వస్తుంది. సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా ఆయన చేసిన సేవలకి గాను కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మ భూషణ్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. జూన్ 10,2025 న బాలయ్య 65వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు.
1974 నాటి తాతమ్మ కలతో చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిన బాలయ్య ఆ తరువాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో హీరోగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇక అక్కడి నుండి బాలయ్య వెనుదిరిగి చూసుకోలేదు. పౌరాణిక, సాంఘిక, జానపద, సైన్స్‌ఫిక్షన్ జానర్లనూ టచ్ చేసి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు బాలయ్య. 1991లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో బాలయ్య హీరోగా వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 చిత్రం ఆయనకి ఎన్నో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం సినిమాల హిట్స్ తరువాత బాలయ్య నటించిన ‘భైరవద్వీపం’ మూవీ మరోస్థాయికి తీసుకెళ్లింది. పెద్దన్నయ్య, పవిత్రప్రేమ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించారు బాలయ్య.
అయితే బాలకృష్ణ కెరీర్‌ను భారీ మలుపు తిప్పిన సినిమా సమరసింహా రెడ్డి అని చెప్పవచ్చు.ఈ సినిమా బాలయ్య బాబుకు ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్‌ను తీసుకువచ్చింది. అయితే 2004లో విడుదలైన లక్ష్మీనరసింహ సినిమా తర్వాత బాలయ్యకి విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు వంటి వరుస ఫ్లాపులు పలకరించాయి. దాంతో బాలయ్య పని అయిపోయిందని అనుకున్నారు. కాని 2010లో సింహా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు . ఆ తర్వాత వచ్చిన లెజెండ్ మూవీతో బాక్సాఫీసును దుమ్ములేపారు. ఇక వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య కెరియర్ లో ఇప్పటివరకు 109 సినిమాలు చేశారు. తదుపరిగా ‘అఖండ-2’, ‘జైలర్ -2’ సినిమాలతో పలకరించనున్నారు. రీసెంట్గా అఖండ 2 టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. బాలయ్య నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగాను సత్తా చాటుతున్నాడు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గానూ బాలయ్య సేవలందిస్తున్నారు. ఇటీవల 50ఏళ్ల నట ప్రస్థానం కూడా పూర్తి చేసుకున్న బాలకృష్ణ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ అందుకోవడం అభిమానులకి పట్టలేని ఆనందాన్ని తెచ్చి పెట్టింది.