Sri Jayabheri Art Productions | తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు మురళీమోహన్ తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అతడు'(Athadu) సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు బర్త్‌డే కానుకగా.. ఆగష్టు 09 ఈ చిత్రం రీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను నిర్మించిన మురళిమోహన్ రీ రిలీజ్ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై త్వరలోనే మళ్లీ సినీ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ‘అతడు’ సినిమా తర్వాత తాము సినీ నిర్మాణానికి కొంత విరామం ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ తెర వెనుకకు వచ్చేందుకు సిద్ధమవుతున్నామని మురళీమోహన్ తెలిపారు. ఈసారి తమ సోదరుడి కుమార్తె ప్రియాంక నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయని, సాంకేతికతతో పాటు కథాంశాల్లోనూ ఎన్నో చేర్పులు జరిగాయని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించగా, ఇటీవల నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాను ప్రస్తావించారు. ఆ సినిమా చూసిన తర్వాత కొత్త నటీనటులతో కూడా మంచి చిత్రాలు తీయొచ్చని తనకు అనిపించిందని, భవిష్యత్తులో అలాంటి వైవిధ్యమైన, కొత్తదనం ఉన్న చిత్రాలను నిర్మించడానికి తమ బ్యానర్ సిద్ధంగా ఉందని మురళీమోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు.