Amritha Aiyer | ‘హను-మాన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ అమృత అయ్యర్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు మంగాదేవి దర్శకుడు. ఈ నెల 20న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అమృత అయ్యర్ మాట్లాడుతూ “హను-మాన్’ షూటింగ్ టైంలోనే ఈ కథ విన్నా. బాగా నచ్చింది. 80 దశకం నేపథ్యంలో జరిగే ఈ కథలో నేను సిటీ అమ్మాయిగా కనిపిస్తా.
తనది చాలా సున్నితమై స్వభావం. కుటుంబం అంటే ప్రాణం. అలాంటి అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా అనిపిస్తుంది. నరేష్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి’ అని చెప్పింది. కెరీర్ ఆరంభం నుంచి అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకుంటున్నానని, ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడతాయని అమృత అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేసింది. తెరపై మహారాణి పాత్రల్లో కనిపించాలన్నది తన కల అని, అలాగే యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం కూడా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నానని అమృత అయ్యర్ తెలిపింది.