Kota Srinivasa Rao | తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. సీనియర్ నటుడు, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, 83 ఏళ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్ లోని ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన కోట శ్రీనివాసరావు, రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చూపించారు.1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా సేవలందించారు.
కోటా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనే విషయంపై ఆయన సన్నిహితుడు, సహనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను గన్మెన్లతో షూటింగ్‌కి వెళ్లే అలవాటు ఉండేది. కోటా అన్న చూసి కాస్త అసూయపడ్డాడు. ‘ఏరా గన్మెన్లు?’ నీకేనా, ‘నువ్వే గెలవగలిగితే.. నేనెందుకు గెలవలేను?’ అన్నట్టు, 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అసలు గన్‌మెన్ కోసమే ఎం.ఎల్.ఎ అయ్యాడు అని బాబు మోహన్ అన్నారు. అసెంబ్లీలో నేను ముందు వరుసలో కూర్చుంటే.. కోటా అన్న లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటాడు. ‘ఏరా మనం అన్నదమ్ములం కదా.. నా పక్కన కూర్చో’ అని అన్నయ్యలా బలవంతం చేసేవాడు.
నేను మంత్రి అయిన తర్వాత నా సీటు మారింది. ‘నువ్వు మంత్రివయ్యావు.. ఇక నా పనైపోయింది’ అన్నట్టు కోటా అసెంబ్లీలోకి రావడం మానేశాడు. తదుపరి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2004 తర్వాత కోటా శ్రీనివాసరావు రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు. నటుడిగా మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను చివరి వరకు కొనసాగించారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. అయినప్పటికీ ఆయన పాత్రలు, డైలాగులు, నటన ఇవన్నీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.