Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. తెలుగు సినిమా కామెడీ చరిత్రలో ఎనలేని కాంబినేషన్ అంటే కోట శ్రీనివాసరావు, బాబు మోహన్లది. ఈ ఇద్దరు నటుల జోడీ తెరపై కనిపిస్తే చాలు, నవ్వుల పంట పండేది. అప్పట్లో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. కామెడీకి కొత్త దారులు చూపిన ఈ కాంబినేషన్ ఎన్నో హిట్ చిత్రాలకు సాక్ష్యమైంది.
కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ కలసి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించారు. కోట గారి గంభీరమైన డైలాగ్ డెలివరీ, విలక్షణమైన హావభావాలు, మరోవైపు బాబు మోహన్ అమాయకపు మానరిజంతో కూడిన టైమింగ్ కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించేలా చేసేవి. దర్శకులు, నిర్మాతలు వీరిద్దరినీ తమ సినిమాల్లో తప్పకుండా తీసుకునే వారు. వీరి కామెడీ ట్రాక్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పని చేసేది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మామగారు సినిమాలో వీరి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రేమ విజేత చిత్రంలో వీరి సంభాషణలు బాగా పాపులర్ అయ్యాయి. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో కామెడీ సన్నివేశాలు నవ్వుల పంట పండించాయి.
అహ నా పెళ్ళంట చిత్రంలో బాబు మోహన్ కనిపించకపోయినప్పటికీ, కోట శ్రీనివాసరావు పోషించిన పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్ర తెలుగు సినిమా కామెడీలో ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా నిలిచిపోయింది. కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ జంట తెలుగు సినిమా హాస్యానికి ఒక ప్రత్యేక అధ్యాయాన్ని అందించింది. ఇప్పుడు కోట తనని వదిలి వెళ్లారని తెలిసి భావోద్వేగానికి గురయ్యారు బాబు మోహన్. కోట మరణం బాధాకరం. నిన్న రాత్రి కూడా ఆయనతో మాట్లాడాను.కోట మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అని కన్నీరు పెట్టుకున్నారు బాబు మోహన్. ఇక కోట మరణ వార్త తెలుసుకున్న చాలా మంది సినిమా ప్రముఖులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయనకు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌కి వస్తున్నారు.