Baahubali: The Epic | మాస్ మహారాజా రవితేజ అభిమానులకు నిరాశ కలిగించే వార్త! ఈ నెల 31న విడుదల కావాల్సిన ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. అదే రోజున ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) రీ-రిలీజ్ అవుతుండటమే. ‘మాస్ జాతర’ సినిమాను మొదట ప్రకటించిన విధంగా అక్టోబర్ 31న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రమోషన్లు కూడా ముమ్మరం చేశారు. అయితే, ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అదే అక్టోబర్ 31న రీ-రిలీజ్ చేస్తుండటం రవితేజ టీమ్‌ను ఆందోళనకు గురిచేస్తుంది.
‘బాహుబలి’కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆ సినిమా విడుదల రోజునే ‘మాస్ జాతర’ విడుదల చేస్తే, ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా ‘మాస్ జాతర’ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 1న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అభిమానులను సంతృప్తి పరచడానికి అక్టోబర్ 31వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ సర్టిఫికెట్ పొందింది. ఇక వాయిదాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.