ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చాక డబ్బింగ్ ప్రక్రియ సులభతరమైంది. భాష రానివారి వాయిస్‌ని కూడా నచ్చిన భాషలో స్పష్టంగా వినిపించొచ్చు. ప్రస్తుతం సినిమా వాళ్లంతా డబ్బింగ్ విషయంలో ఏఐని విపరీతంగా వాడేస్తున్నారు. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఏఐని దూరంగా ఉంచారు. సంభాషణల్లో భావోద్వేగాలు సహజంగా ఉండాలంటే మనుషులతోనే మాట్లాడించడం శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నారు. ఇతర భాషల్లో అనువదించే క్రమంలో కూడా ఇదే విధానాన్ని పాటించాలని ఆయన ఫిక్స్ అయ్యారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’ 120 దేశాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత కేఎల్ నారాయణ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాధ్యమైనంతవరకూ ‘వారణాసి’లో ఓన్ వాయిస్‌లే వినిపించేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏ పాత్రకైనా డబ్బింగ్ అవసరమైతే.. ఏఐతో కాకుండా వేరే వ్యక్తితో అయినా డబ్బింగ్ చెప్పించాలని ఆయన గట్టిగా నిర్ణయించారట. అందుకే ప్రస్తుతం ‘రియల్ వాయిస్’లను వెతికే పనిలో ఉన్నారట రాజమౌళి.
50 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది కాబట్టి, ఆయా భాషల్లో పట్టు ఉన్న 1500మంది డబ్బింగ్ కళాకారులతో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వారందరినీ పరిశీలించి, మ్యాచ్ అయ్యేవారితో డబ్బింగ్ చెప్పిస్తారన్నమాట. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీత దర్శకుడు.