ముంబయిలో జరుగుతున్న వేవ్స్ (ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) సదస్సులో పాల్గొన్న అగ్ర నటుడు అల్లు అర్జున్ తన కెరీర్‌తో పాటు పలు వ్యక్తిగత అంశాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డీజే, నా పేరు సూర్య చిత్రాలు పరాజయం పాలవ్వడంతో దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు అల్లు అర్జున్. ఈ చిత్రాల విడుదలకు ముందు తాను ఎవరి సలహాలు పాటించలేదని, జీవితం పట్ల ఉదాసీన వైఖరితో ఉన్నానని బన్నీ తెలిపారు.
“నా పేరు సూర్య’ రిలీజ్‌కు ముందు నా శ్రేయోభిలాషులు కొందరు కెరీర్ విషయంలో మంచి సూచనలు చేశారు. నేను పట్టించుకోలేదు. అంతా నేను అనుకున్నట్లే జరుగుతుందనుకున్నా. కానీ సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఆరు నెలల బ్రేక్ తీసుకోవాలనుకున్నా. అది కాస్త 15 నెలలు అయింది. ఆ టైమ్‌లో నేను ఆత్మవిమర్శ చేసుకున్నా. ఇతరుల సలహాలు తీసుకోవడంలో తప్పులేదనిపించింది.
అప్పటి నుంచి లైట్ బాయ్ సలహాలు కూడా స్వీకరించడానికి వెనకాడటం లేదు. కొందరు వ్యక్తిత్వ నిపుణుల సలహాలు తీసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నా’ అని అల్లు అర్జున్ చెప్పారు. అట్లీ దర్శకత్వంలో చేయబోతున్న పాన్ వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు భారతీయ సినిమాలో రానటువంటి కాన్సెప్ట్ ఇదని, భారతీయ మూలాలున్న ఈ కథని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నామని చెప్పారు. సినిమాల్లోకి రావడానికి తన మావయ్య చిరంజీవి స్ఫూర్తినిచ్చారని, ఆయన ఎన్నో గొప్ప విజయాలను చూసి కూడా వినమ్రంగా ఉంటారని, తనలాంటి నటులకు ఆయనే ఆదర్శమని అల్లు అర్జున్ అన్నారు.