మహేష్‌బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మహేష్‌బాబు జన్మదినమైన ఆగస్ట్ 9న ఈ సినిమాకు సంబంధించిన సర్ప్రైజ్ న్యూస్ ఉంటుందని అందరూ ఎదురుచూశారు. కానీ ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి పకడ్బందీగా కార్యచరణను రూపొందిస్తున్నారని తెలిసింది. స్క్రిప్ట్ విషయం మొదలుకొని నటీనటుల ఎంపిక వరకు ప్రతీ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. వాస్తవానికి ఈ వేసవిలోనే ఈ సినిమాను మొదలుపెట్టాలనుకున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో మరింత సమయాన్ని తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కాబోతున్నారు.