తమిళ చిత్రసీమలో వరుస సినిమాలతో బిజీగా ఉంది యువ నాయకి అతుల్య రవి. ‘మీటర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ భామ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ప్రేమ, పెళ్లి గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. పెళ్లికి ముందు శృంగారం గురించి మాట్లాడుతూ ‘నేటి యువతీయువకుల్లో సహజీవనం చేసే వారి సంఖ్య ఎక్కువవుతున్నది. దాంతో అనుబంధాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం. అయితే పెళ్లికి ముందు శృంగారాన్ని నేను ఏమాత్రం సమర్థించను.
అది మన భారతీయ సంస్కృతికి పూర్తి విరుద్ధం. ప్రేమలో ఉన్నవారు జీవితంలో త్వరగా స్థిరపడి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికంటే పెళ్లి చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ఒక బంధంలోని అనేక సమస్యలను అది పరిష్కరిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.