Ashish Warang | బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. మరణానికి కారణాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. ఆశిష్ హఠాన్మరణంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సపోర్టింగ్ రోల్స్ ద్వారా ప్రేక్షకుల మనసు దోచిన ఆశిష్, అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ ‘దృశ్యం’, రాణి ముఖర్జీ ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
హిందీ చిత్రాలతో పాటు మరాఠీ సినిమాల్లోనూ ఆశిష్ మంచి పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. మల్టీ-టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన రానున్న రోజులలో మరిన్ని ఉత్తమ అవకాశాలు అందుకొని స్టార్ నటుడిగా మారుతాడు అనుకుంటున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఆశిష్ మృతిపై పలువురు నటులు, దర్శకులు, సహనటులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “అతడి మరణాన్ని నమ్మలేకపోతున్నాం. మంచి నటుడు, మంచి మనిషి. సినిమా సెట్స్‌లో ఆయన ఎనర్జీ మాకు గుర్తుండిపోతుంది” అంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.
ఆశిష్ మృతి వెనక అసలు కారణం ఏంటన్నది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు ఎలాంటి వివరాలు మీడియాకు అందించలేదు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో వివిధ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారణం త్వరలో వెలుగులోకి రానుంది. సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న ఆశిష్ వారంగ్ ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.