సీనియర్ హీరోల పాలిటి వరంగా మారారు కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్. ‘నా సామిరంగ’లో అక్కినేని నాగార్జునకు జోడీగా ఆకట్టుకున్న ఆషికా.. ‘విశ్వంభర’లో మెగాస్టార్‌తో కూడా కలిసి నటించారు. ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. ఆమె రాబోతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో మరో సీనియర్ హీరో రవితేజతో జత కట్టారామె. తమ ఏజ్ గ్రూప్ హీరోలతోనే నటిస్తామంటూ చాలామంది హీరోయిన్లు పంతంపట్టి కూర్చుంటున్న నేటి తరుణంలో ఆషికా సీనియర్ హీరోయిన్ల పాలిటి వరంగా మారింది.
ఈ విషయంపై ఇటీవల ఆమె మాట్లాడుతూ ‘నాకు పాత్ర ముఖ్యం. మంచి కథ, అభినయానికి అవకాశం.. ఈ రెండూ ఉంటే కాంబినేషన్ల గురించి ఆలోచించను. నా దృష్టిలో ఏ సినిమాకైనా కథే హీరో. ఆ కథతో నేను జోడీ కడతా. అవకాశాలకోసం కథలో లేని పాత్రల్ని మాత్రం చేయను. చిరంజీవి, నాగార్జున, రవితేజ లాంటి లెజెండ్స్‌తో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.’ అన్నారు ఆషికా రంగనాథ్.