Asha Bhosle | భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన అద్భుతమైన గాత్రంతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది శ్రోతలను అలరించిన ఆమె, సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆశా భోస్లే తన కెరీర్లో వేలాది పాటలకు ప్రాణం పోశారు. ఎన్నో భాషల్లో, ఎన్నో తరాలకు చెందిన హీరోయిన్లకు ఆమె గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పాడిన పాటలు ఇప్పటికీ శ్రోతల మనసుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఆశా భోస్లే వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా మారింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే గణపత్రావ్ భోస్లేను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. అయితే ఈ వివాహం విఫలమవడంతో, తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ను రెండో వివాహం చేసుకున్నారు.
ఆమె కుటుంబ జీవితం సుఖదుఃఖాలతో నిండి ఉంది. పెద్ద కొడుకు హేమంత్ భోస్లే మొదట పైలట్‌గా పనిచేసి, తర్వాత సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. కానీ 2015లో క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఆమె కూతురు వర్ష భోస్లే 2012లో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. ఈ సంఘటనలు ఆశా భోస్లే వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆమె చిన్న కొడుకు ఆనంద్ భోస్లే బిజినెస్ మేనేజ్మెంట్, ఫిల్మ్ డైరెక్షన్లో విద్యాభ్యాసం చేశారు. కుటుంబంలో సంగీత వారసత్వం కొనసాగుతోంది. మనవడు చైతన్య భోస్లే సంగీత రంగంలో కొనసాగుతుండగా, మనవరాలు జానై భోస్లే గాయని, కథక్ నర్తకిగా గుర్తింపు పొందుతున్నారు.
ఆశా భోస్లే తన సుదీర్ఘ కెరీర్లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. హిందీ, బెంగాలీ, మరాఠీతో పాటు అనేక భాషల్లో భజనలు, గజల్స్, ఖవ్వాలీలకు ఆమె గాత్రం ప్రాణం పోశింది. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆమె మరణంతో సంగీత ప్రపంచం ఒక అపూర్వమైన గాత్రాన్ని కోల్పోయింది. కానీ ఆమె పాడిన పాటలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.