గోల్నాక, మే 25 : వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేసిన భర్త దురదృష్ట వశాత్తు గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందాడు. వివాహమై ఏడాదిన్నర అయినా.. భర్తే తన లోకంగా బతికిన ఆ ఇల్లాలు తీవ్ర మనస్తాపం చెంది నీవు లేని లోకంలో నేనూ ఉండలేనంటూ నాలుగు రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. అతడి వెంటే పైలోకాలకు వెళ్లి పోయింది. ఈ విషాదకర ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ డి.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి (29) వివాహం ఏడాదిన్నర కిందట వనస్థలిపురానికి చెందిన మనోజ్ (31)తో జరిగింది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన మనోజ్.. వివాహం అనంతరం భార్య సాహితితో కలిసి అమెరికా డల్లాస్‌లో స్థిరపడ్డాడు.
ఈనెల 2వ తేదీన తన తల్లిదండ్రులను చూసేందుకు సాహితి అమెరికా నుంచి డీడీ కాలనీకి వచ్చింది. కాగా, ఈ నెల 20న అమెరికాలో ఉన్న మనోజ్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడ దవాఖానలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందాడు. ఆ వార్త విన్న సాహితి.. భర్త మృతిని తట్టుకోలేక పోయింది. ఈనెల 23న మనోజ్ మృతదేహాన్ని అమెరికా నుంచి తన స్వస్థలమైన వనస్థలిపురం తరలించారు. ఈ నెల 24న అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. భర్త అంత్యక్రియల అనంతరం వనస్థలిపురం నుంచి డీడీ కాలనీలోని తన తలిదండ్రుల ఇంటికి చేరుకున్న సాహితి.. రాత్రి తన చెల్లెలు సంజనతో కలిసి పడుకుంది.
గురువారం ఉదయం 9.30 సమయంలో సాహితి చెల్లెలు వాష్‌రూమ్‌కు వెళ్లగా.. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న సాహితి ఇదే అదునుగా భావించి గదిలోని ఫ్యాన్‌కు పది నిమిషాల వ్యవధిలోనే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన చెల్లెలు చూసే సరికి సాహితి నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాహితి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని వనస్థలిపురం తరలించి, భర్త అంత్యక్రియలు చేసిన చోటే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.