The Bads of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయానంతరం ఆర్యన్ ఖాన్ తొలిసారిగా ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన తండ్రి షారుఖ్ ఖాన్‌తో ఉన్న అనుబంధం, ఫిల్మ్ మేకింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి గల కారణాలను పంచుకున్నాడు.
సినిమా నిర్మాణం పట్ల నాన్నకు (షారుఖ్ ఖాన్) అపారమైన పరిజ్ఞానం ఉంది. వీఎఫ్ఎక్స్, లైటింగ్, కెమెరా పనితీరు… ఇలా ప్రతి సాంకేతిక అంశం గురించి ఆయన చాలా లోతుగా అధ్యయనం చేశారు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు షూటింగ్ సెట్స్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన నాకు ఎన్నో టెక్నికల్ విషయాలు చూపించేవారు అని ఆర్యన్ తెలిపాడు. షూటింగ్ సమయంలో నిజంగా బుల్లెట్ తగలదు.. కానీ దాన్ని తెరపై ఎలా చూపిస్తారు, లేదంటే విమానం ఎగరనప్పటికీ అది ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లు ఎలా చిత్రీకరిస్తారు వంటి విషయాలను ఆయన నాకు వివరించేవారు. ఒక చిన్న పిల్లాడికి ఆ టెక్నిక్స్ అన్నీ చూస్తే అద్భుతంలా అనిపించేవి. అలా చిన్నప్పటి నుంచే నాలో ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తి పెరిగింది అని ఆర్యన్ తన తండ్రి స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.
లాక్డౌన్లో ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్:
లాక్డౌన్ సమయాన్ని తమ కుటుంబం ఎలా గడిపిందో కూడా ఆర్యన్ పంచుకున్నాడు. లాక్డౌన్ సమయంలో దాదాపు రెండేళ్ల పాటు పెద్దగా పని లేకపోవడంతో నేను నాన్న, చెల్లి సుహానా ఖాన్ కలిసి ఒక కథ రాసుకున్నాం. దాన్ని మా ఇంట్లోనే షార్ట్ ఫిల్మ్‌గా చిత్రీకరించాం అని వెల్లడించాడు. ఆ షార్ట్ ఫిల్మ్‌లో షారుఖ్, సుహానా నటీనటులుగా వ్యవహరించగా తాను సినిమాటోగ్రాఫర్ (డీఓపీ)గా పనిచేశానని ఆర్యన్ చెప్పుకోచ్చాడు.
తన తొలి సిరీస్ విజయంపై ఆర్యన్ ఖాన్ స్పందిస్తూ ఈ సిరీస్‌లో మాపై (బాలీవుడ్ ప్రముఖులపై) మేమే సెటైర్లు వేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఎక్కడా కూడా ఎవరినీ అగౌరవపరచకూడదని హద్దులు దాటకుండా చూసుకోవాలని భావించాం. ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ గురించే కథను చెప్పేటప్పుడు ఆ గౌరవాన్ని తప్పకుండా పాటించాలి. ఈ కామెడీలో ముఖ్యమైన విషయం ఏమిటంటే… మనల్ని మనం విమర్శించుకోగలిగే స్పోర్టివ్ నెస్ ఉండాలి. ఇండస్ట్రీలోని వారందరూ మా సిరీస్‌ను చాలా సానుకూలంగా తీసుకున్నారు అని ఆర్యన్ ఖాన్ వివరించారు.